సాఫ్ట్‌వేర్ స్వేచ్ఛ దినోత్సవం రోజు స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ క్యాంపు 2020 మొదలవుతుంది

Published on: September 19, 2020 | Reading Time: 2 min
camp

Also available in:


స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ గురించి, దాని సుగుణాల గురించి చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సాఫ్ట్‌వేర్ స్వేచ్ఛ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచం జరుపుకుంటూంది. ఆ స్ఫూర్తితో, ఆ ప్రేరణతో ఈ రోజు మేం స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ క్యాంపుని ప్రకటిస్తున్నాం.

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ క్యాంపు అనేది ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఫ్రీ సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా సంస్థలు నిర్వహించే ఆన్‌లైన్ మెంటర్‌షిప్ క్యాంపు. ఇది అక్టోబరులో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ నడుస్తుంది.

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులకు తోడ్పాడదామని ఉండి నిర్మాణాత్మక మార్గదర్శకం, మొదలుపెట్టడానికి తగ్గ నేర్చుకునే వాతావరణం కావాలనుకునేవారికి ఈ స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ క్యాంపు ఒక విలువైన అవకాశం. ప్రస్తుతం స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులకు తోడ్పడుతున్నవారికి కూడా వారి ప్రాజెక్టులకు కొత్త తోడ్పాటుదార్లను పొందడానికి, కొత్తవారిని స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ సముదాయం లోనికి ప్రవేశింపజేయడానికి కూడా ఇది మంచి అవకాశం.

నేర్చుకునేవారికి, మెంటర్ల కొరకు దరఖాస్తు ఫారాల లంకెలు ప్రస్తుతం క్యాంపు వెబ్‌సైటులో అందుటాబులో ఉన్నాయి. ఇవి అక్టోబర్ 15 వరకూ తెరిచివుంటాయి.

నేర్చుకునేవారు స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ తత్వాన్ని పరిచయం చేసుకునేందుకు, అదే సమయంలో స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ తోడ్పాటుదార్లు కావడానికి తగిన సంపత్తిని సంపాదించుకునేందుకు ఈ క్యాంపు సురక్షితమైన చోటుగా ఉండాలని ఆశిస్తుంది. క్యాంపు మొదటి దశలో, కొత్తవారికి స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ యొక్క సాంఘిక ప్రయోజనాలను, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ సంస్కృతిని పరిచయం చేసే కొన్ని అభ్యాసాలు, సంభాషణలు, సినిమా ప్రదర్శనలు, ఇతర కార్యకలాపాలు ఉంటాయి. కొత్తవారు తమ సొంత పరికరాలలో స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ వాడుకోడానికి తగిన సహాయం కూడా పొందుతారు. ఈ దశ చివరలో, పలు స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను దగ్గరగా చూసే అవకాశం పొందడంతో పాటు, మెంటర్లతో పనిచేసి ఆయా ప్రాజెక్టులలో పాలుపంచుకోడానికి కార్యాచరణ ప్రతిపాదనలను చేయగలుగుతారు. వారి ప్రతిపాదనలకు అనుగుణంగా మెంటర్లను క్యాంపు కేటాయిస్తుంది. రెండవ దశలో, ప్రతి అభ్యర్థి వారి ఆమోదిత ప్రతిపాదనల మేరకు, వారి మెంటర్లతో దగ్గరగా పనిచేస్తూ, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లకు తోడ్పడటం మొదలుపెడతారు. నేర్చుకునేవారి అవసరాలకు తగ్గట్టు, వారు సరైన దారిలో వెళ్తున్నారో చూసేందుకు తరచూ సమీక్షా సమావేశాలు ఉంటాయి.

క్యాంపు సైటులో పేర్కొన్న ఆవశ్యకాలను కలిగివున్న ప్రస్తుత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ తోడ్పాటుదార్లు ఎవరైనా, మెంటరు కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారు తమ ఆలోచనలను కూడా నేర్చుకునేవారికి మొదలుపెట్టగలిగేలా ఉన్న ఆలోచనల జాబితాకు చేర్చవచ్చు, వీటి నుండి నేర్చుకునేవారు తమ ప్రతిపాదనలను తయారుచేస్తారు. ప్రతిపాదనలను బేరీజు వెయ్యడంలోనూ, ఎంపిక లోనూ, ఎంపికైన ప్రతిపాదనలు విజయవంతమయ్యేలా నేర్చుకునేవారికి సహకరించడం లోనూ మెంటర్లు క్యాంపు నిర్వాహకులతో కలిసి పనిచేస్తారు.

క్యాంపు అన్ని రకాల తోడ్పాట్లను, తోడ్పాటు మార్గాలను ప్రోత్సహిస్తుంది - ప్రోగ్రామింగు, సిస్టమ్ అడ్మినిష్ట్రేషన, ప్యాకేజింగ్, UI/UX, ఫోరెన్సిక్స్, స్థానికీకరణ, ఆర్ట్‌వర్కు, డాక్యుమెంటేషన్, ప్రచారం, కార్యక్రమ నిర్వహణ, మొదలైనవి - అవి స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ తత్వానికి బద్దమైనంత వరకూ. స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ కమ్యూనికేషన్ పనిముట్లు అయిన బిగ్ బ్లూ బటన్, మాట్రిక్స్ వంటి వాటితో క్యాంపు నిర్వహించబడుతుంది. పాల్గొనడం ఉచితం, ఫీజు ఏమీ చెల్లించనవసరం లేదు.

మరిన్ని వివరాలకు, దరఖాస్తు చేయడానికి https://camp.fsf.org.in సైటుకి వెళ్ళండి.